Thursday, January 26, 2017

సంసారంలో సరిగమలు (సీరియల్స్)




'అలా ఖాళీగా కుర్చోకపోతే కాస్త గెరాజ్ క్లీన్ చెయ్యొచ్చు కదా? షెల్ఫ్ లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి చాలా రోజుల నుంచీ!' టీవీ ఆన్ చేస్తూ భర్తతో అంది సుధ.

టీవీ ఎదురుగా సోఫాలో కూర్చుని సీరియస్ గా లాప్టాప్ లో తెలుగు వార్తలు చదువుతున్న ఆనంద్ అది వినగానే ఉలిక్కిపడి 'చచ్చాన్రా దేవుడా!' అంటూ మనసులోనే తిట్టుకున్నాడు.

కాలిఫోర్నియాలో ఉండే ఆనంద్ సుధా దంపతులకి పదేళ్ళ కూతురు దియా. భర్త లాప్టాప్ ముందు కుర్చుని ఆఫీసు పని కాకుండా అఖ్ఖర్లేని పనేదో చేస్తున్నాడని సుధకి అనుమానం వస్తే ఇలాగే ఏదో ఒక పని పురమాయించి టీవీ లో పెద్ద సౌండ్ తో తెలుగు సీరియల్ ఒకటి మొదలుబెట్టి ఆ డైలాగ్స్ వింటూ కిచేన్ లో వంట చేసుకుంటూ ఉంటుంది. దాని అర్ధం ఆనంద్ సుధ చెప్పిన పని పూర్తి చేసే దాకా ఆ సీరియళ్ళ గోల ఆగదని. భార్యతో వాదించటం, సీరియల్స్ చూడటం కన్నా పెద్ద తలనొప్పి పనులు ప్రపంచంలో ఇంకేవీ లేవని భావించే ఆనంద్ తిట్టుకుంటూ ఆ పనులు చేస్తుంటాడు. కొన్నిసార్లు సాహసించి అలానే కూర్చున్నా అరగంట కన్నా ఆ తలనొప్పి భరించలేకపోయేవాడు. అరగంట లోనే పదినిమిషాలకి ఒకసారి వచ్చి 'హీరోయిన్ ఏవందీ? నేను ఆ డైలాగ్ మిస్సయాను!' అని సుధ అడిగే ప్రశ్నలు ఇంకా టార్చర్! చెప్పలేదంటే రివైండ్ చేసుకుని మరీ చూస్తుంది, ఆ రోత మళ్ళీ మళ్ళీ చూడటం కన్నా నరకమే నయం. 'నాతో పనులు చేయించడం సరే, ఆ గోల నువ్వెలా భరిస్తున్నావు?' అని అడగాలనుకుంటాడు కానీ 'మిమ్మల్నే భరించగా లేనిది ఆ సీరియల్స్ దేముందీ' లాంటి సమాధానాలు వస్తాయని భయం.

'హిందీ నుంచి డబ్ చేసినవి పెడుతుందా, స్వచ్చమైన తెలుగువి పెడుతుందా?' అని మనసులో ఆలోచిస్తూ, పైకి 'కాసేపాగి చేస్తాలే' అన్నాడు. హిందీవి అయితే కొంత నయం, చెత్తకధే అయినా కొంతలో కొంత ముందుకు నడుస్తూ ఉంటుంది. అచ్చతెలుగువైతే మరీ ఘోరం, సంవత్సరం తర్వాత కూడా కధ అక్కడే ఉంటుంది. పైగా కారెక్టర్స్ అన్నీ బీపీ వచ్చినట్టు హైపిచ్ లో అరుచుకుంటూ ఉంటాయి. ఎంత చిన్నమాటకైనా అందరి మొహాల్నీ క్లోజప్ లో చూపిస్తూ వెనకాల చెవుల తుప్పొదిలిపోయే రేంజ్ లో భయంకరమైన మ్యూజిక్ తో వాయించేస్తాడు. ఆ మెలోడ్రామాలు భరించటం మరీ కష్టం.

ఆనంద్ భయపడ్డట్టుగానే కధా పాడూ ఏమీ లేకుండా గత ఐదేళ్ళుగా దిగ్విజయంగా నడుస్తున్న తెలుగు డైలీ సీరియల్ ఒకటి మొదలు పెట్టింది సుధ.

'నిజానికి ఇది ఈ మధ్య అంతగా బాగుండట్లేదు..ఈటీవీ లో కొత్త సీరియల్ ఒకటి మొదలుపెడుతున్నారు, దానికి షిఫ్ట్ అవుదామా అనుకుంటున్నాను..' సాలోచనగా అంది సుధ.

సోఫాలో కుర్చుని హోం వర్క్ చేస్తూ తల్లికి కనపడకుండా తలవంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్న కూతుర్ని చూస్తూ 'ఏ రాయైతే ఏముందిలే!' మనసులోనే అనుకున్నాడు ఆనంద్.

ఆ రోజు భాగం మొదలవగానే ఎప్పట్లానే ఏడుపుమొహంతో వచ్చిన హీరోయిన్ని చూస్తూ 'ఇంక తప్పేలా లేదు, న్యూస్ ఐదు నిమిషాల్లో ముగించి ఆ షెల్ఫ్ గోలేమిటో చూడాలి ' అనుకుంటూ మళ్ళీ లాప్టాప్ లో మునిగిపోయాడు.
#########################################################################


'ఈ ఇంట్లో ఒక కన్నెపిల్లకి అన్యాయం జరిగింది..' శివాలెత్తుతూ అరుస్తోంది సీరియల్లో ఆడవిలన్ కారెక్టర్.

"డాడ్, 'ఖన్నెఫిల్లా' అంటే ఏంటీ?" హోం వర్క్ పూర్తి చేసేసి విషయమేమీ లేకుండా అరుచుకుంటున్న ఆ కారెక్టర్స్ ని ఆసక్తిగా చూస్తూ సందేహంగా అడిగింది దియా, న్యూస్ చదువుతున్న తండ్రిని డిస్టర్బ్ చేస్తూ.

'కన్నెపిల్ల అంటే అమ్మాయి అనమ్మా! నీ హొం వర్క్ అయిపోతే లైబ్రరీ నుంచి మొన్న తెచ్చిన బుక్స్ చదువుకో' అనునయంగా అంటూ కూతురి ధ్యాస మరల్చటానికి ప్రయత్నించాడు.

'పిల్ల అంటే అమ్మాయి. కన్నె అంటే?'

'it’s just an adjective అమ్మా' తలగోక్కుంటూ దాటేయబోయాడు.

'Well, does that adjective have a meaning?' వదల్లేదు దియా!

ఏమి చెప్పాలో అర్ధం కాలేదు ఆనంద్ కి. దియా తండ్రి మొహంలోకే చూస్తోంది సమాధానం కోసం!

‘nothing relevant to the context as such… అయినా ఆ డైలాగ్స్ రాసేవాళ్ళు అంత లాజికల్ గా ఆలోచించి రాయరు. అంత బుర్ర ఉన్నవాళ్ళు ఇవి చూడరు..' మనసులో దాచుకున్న అక్కసంతా బయటికి వచ్చేసింది.

'ఏమిటీ అంటున్నారు?' అట్లకాడ తిప్పుకుంటూ కిచెన్ లో నుంచి వచ్చి సీరియస్ గా అడిగింది సుధ.

'అదే, అంత ఎక్కువగా ఆలోచిస్తే ఈ సీరియల్సు, సినిమాలు చూడలేము అంటున్నా' అన్నాడు ఆనంద్ మాటమారుస్తూ.

తల్లి ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ పుస్తకాల్లోకి తలదూర్చింది దియా!

'నాకు ఇంకోలా వినబడింది?'

'నువ్వు ఆ సీరియల్ ధ్యాసలో ఉన్నావేమోలే'

'మీరు పైకి "హీరో రవితేజ కి నోటిదూల ఎక్కువ, నేను అలాంటి సినిమాలు చూడను" అంటారుగానీ మీ టాలెంట్ మీకు తెలియదు..' ఇంకా సీరియస్ గానే ఉంది సుధ.

'నువ్వేదంటే అదే కానీ, ఇప్పుడు ఈ సీరియల్స్ గోల ఎందుకు? ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా'

ఆ మాటతో కొంచెం శాంతపడి కిచెన్ లోకి వెళ్తున్న సుధని చూస్తూ ఊపిరి పీల్చుకుని ఆపేసిన న్యూస్ చదవటం మళ్ళీ మొదలుపెట్టాడు ఆనంద్.

'ఎప్పుడూ వర్క్ ఫ్రం హోం చేయడం తప్ప ఎన్నడూ ఆఫీస్ కి రాని గోపాల్ ఈ మధ్య రోజూ ఆఫీస్ కి వస్తున్నాడు, ఎందుకో మరి..' కిచెన్ లోనుంచే అంది సుధ.

'ఇండియా నుంచి వాళ్ళ అత్తగారూ వాళ్ళు వచ్చారేమో' అన్యమస్కంగా అనేసి వెంటనే నాలుక్కరుచుకున్నాడు.

'ఏంటీ?' కిచెన్ లో నుంచి పరుగెత్తుకొచ్చినంత పని చేసింది సుధ. కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది, మొహంలో నవ్వు, ఆశ్చర్యం, కోపం కలగలిసి ఉన్నాయి.

'అంటే, చుట్టాలు ఎవరైనా వచ్చారేమో? ఇంట్లో జనాలు ఉంటే ఆఫీస్ కాల్సు అవీ కష్టం కదా, అందుకోసం వస్తున్నాడేమో'

'అత్తగారువాళ్ళు వస్తున్నారంటే జనరల్ గా అమ్మాయిలు భయపడతారు...ఈ మధ్య అబ్బాయిలు కూడా భయపడుతున్నారా?'

'అదేమో గానీ ఈ సారి కిచెన్ లోనుంచి వచ్చేటప్పుడు ఆ అట్లకాడ అక్కడే పెట్టేసిరా. అసలే వేడిగా ఉన్నట్టుంది, పొరపాటున ఎక్కడ అంటించుకుంటావో అని భయమేస్తోంది..' సందేహంగా అన్నాడు.

'నాకే కాదు, ఎవరికీ "పొరపాటుగా అయితే" అంటించను కానీ ముందు ఇది చెప్పండి....అత్తగారువాళ్ళు వస్తే అబ్బాయిలు భయపడిపోయి ఆఫీస్లకి వెళ్తారా?'

'కలికాలం! ఏమైనా జరగచ్చు..అతను ఆ టైపేమో' పెద్దగా పొడిగించకుండా మళ్ళీ లాప్టాప్ లోకి చూస్తూ అన్నాడు.

'క్రిందటేడు మా అమ్మా వాళ్ళు మనదగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రాజెక్టు, డెలివరీ అంటూ తెగ హడావిడి పడిపోయినట్టున్నారు?' అనుమానంగా అంది.

'ఫైవ్ మిలియన్ డాలర్ ప్రాజెక్ట్ డెలివరీ అంటే టెన్షన్లు తప్పవు మరి..' సోఫాలో ఇబ్బందిగా కదిలాడు.

'అంతే గానీ మా పేరెంట్స్ రావడం వల్ల కాదంటారు?'

'అబ్బా...అలాంటిదేమీ లేదు కానీ నీకు మరీ ఇంత అనుమానం ఎందుకు? నేనేదో మాటవరసకి అన్నానంతే'

'ఏమైనా అనే ముందు ఆలోచించుకుని అనాలి అని మీరే ఎప్పుడూ అంటుంటారుగా?'

'ఏదోలే' అని పైకి అంటూ 'ఇవ్వాళ నా టైం బాలేదు..' మనసులో గొణుక్కున్నాడు.


'మీ ప్రాజెక్టు డెలివరీ గురించి నాకింకా అనుమానంగానే ఉంది..' అంది సుధ అప్పటి విషయాలు గుర్తుకుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ..

'అయ్యబాబోయ్, నిజంగా అలాంటిదేమీ లేదు. అయినా మీ మదర్తో అంత భయపడక్కర్లేదు, నువ్వు నమ్మకపోవచ్చుగానీ!' అనేసిన తర్వాత ఎందుకన్నానా అని తల పట్టుకున్నాడు.

'నేను నమ్మకపోవచ్చా??' మొహంలో నవ్వు, ఆశ్చర్యం పోయి కోపం ఒక్కటే మిగిలింది.

'ఐ మీన్...అదీ....అంటే నా ఉద్దేశం....' 
.
.
.
.
'ఊ.....మీ ఉద్దేశ్యం???'  

'అదే, నీకు మీ అమ్మ కన్నా ఓర్పు ఎక్కువ అని మీ నాన్నగారు అప్పుడప్పుడూ అంటుంటారన్నావు కదా, అందుకని నమ్మవేమో అనుకున్నాను..'

'మా నాన్నగారు అలా అంటారని నేనెప్పుడు చెప్పాను?'

'మర్చిపోయుంటావు...ముందు ఆ సీరియల్ చూడు, చాలా భాగం మిస్సవుతున్నట్టున్నావు!' అన్నాడు, ఇక్కడ ఉండటం కన్నా వెళ్ళి షెల్ఫ్ క్లీన్ చేయడమే నయమేమో అనుకుంటూ!

'కావాలంటే మళ్ళీ రివైండ్ చేసుకుని చూస్తాను కానీ మీరు ముందు చెప్పండి..'

'ఇంక చెప్పటానికేమీ లేదు గానీ మిరపకాయ బజ్జీలు చేస్తానన్నావు, అన్నీ నువ్వే తినేసావా? చాలా హాట్ హాట్ గా ఉన్నావు?' చల్లబరచటానికి ప్రయత్నిస్తూ నవ్వాడు.

'మిరపకాయలు తినక్కర్లేదు, మీ మాటలు వింటే చాలు, నషాళానికెక్కడానికి!' కిచెన్లోకి వెళ్తూ అంది సుధ.

'ఆలి కాదురా అది అనకొండా' సడెన్ గా ఏదో పాట గుర్తుకొచ్చి పైకి పాడబోయి ఆగిపోయాడు.


#####################################################################


'ప్రపంచంలో మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారో లేక నా అదృష్టమే ఇలా ఉందో' ప్లేట్లో బజ్జీలు పెట్టి ఇస్తూ అంది సుధ నవ్వుతూ, కొంచెం వెటకారంగా.

'నా అదృష్టం గురించి నాకైతే ఎలాంటి అనుమానమూ లేదు...అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉంది..' గొంతుదాకా వచ్చిన మాటల్ని బయటికి రాకుండా ఆపేసుకున్నందుకు తనను తానే అభినందించుకున్నాడు.

సుధ ఇంకా తన వంకే చూస్తుండటం గమనించి 'No. You are the luckiest one. మగవాళ్ళందరూ నాలా మంచి వాళ్ళుండరు..' అని అంతలోనే సుధ వెటకారంగా ఇంకేదో అనబోతుండటంతో 'Of course, I am lucky too' అని కలిపాడు.


నిజమా, ఎగతాళా అన్నట్టు సుధ పరీక్షగా ఆనంద్ మొహంలోకి చూసింది.

'ఇంతటి అవమానాన్ని భరించేది లేదు. ఆ నా కొడుకు మీద నాకొడుకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటాడు..' టీవీ లో ఇంకో కారెక్టర్ ఆవేశపడిపోతూ అరుస్తోంది.

సుధా ఆనంద్ ఇద్దరూ టీవీ వైపూ, దియా వైపూ చూసి ఒకరిమొహాలు ఒకరు చూసుకున్నారు.

'నువ్వు అర్జెంట్ గా టాపిక్, చానెల్ రెండూ మార్చకపోతే నేను గెరాజ్ లోకి వెళ్ళిపోతాను, ఆ డైలాగ్స్ కి అర్ధమేమిటో దియాకి నువ్వే చెప్పుకోవాలి..ఇంక నీ ఇష్టం' ఏదో అడగబోతున్న దియాని చూపిస్తూ బెదిరిస్తున్నట్టు అన్నాడు ఆనంద్.

'నేనెలాగో ప్రశాంతంగా డైలాగ్స్ వినలేకపోతున్నాను, తర్వాత చూస్తాను కానీ మీరు ముందు దానికి మాథ్స్ చెప్పండి..' టీవీ ఆఫ్ చేస్తూ అంది సుధ.

'హమ్మయ్య..గండం గడిచింది..బ్రతుకుజీవుడా..' అనుకుంటూ సోఫాలో వెనక్కి వాలాడు ఆనంద్.