Monday, October 16, 2017

ఒక జంట కధ - II



Link for Part-I


తలకి బలమైన గాయాలు కావడంతో మనోజ్ఞ కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు  సర్జరీలు చేసి స్పృహలోకి తెప్పించగలిగారు కానీ ఆప్టికల్ నెర్వ్స్ దెబ్బతినడం వల్ల కంటిచూపు  పూర్తిగా పోయింది. మళ్ళీ చూపురావడానికి యాభై శాతం మాత్రమే అవకాశముందనీ,  గాయాలు పూర్తిగా మానినతర్వాత పరీక్షలు చేస్తేగానీ ఖచ్చితంగా చెప్పలేమనీ, అందుకు ఐదారు నెలలు పట్టొచ్చనీ డాక్టర్లు చెప్పారు. నాలుగు వారాల తర్వాత హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ చేస్తే తన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు తీసుకుని వెళ్ళిపోయారు.

ఎడమకాలి మీద నుంచి కార్ వెళ్ళడంతో ప్రభాత్ కాలి ఎముకలు విరిగిపోయి మోకాలి క్రింది భాగం తీసేయాల్సి వచ్చింది. గాయాలు పూర్తిగా మానిన తర్వాత ప్రాస్తెటిక్ లెగ్ లాంటివి ప్రయత్నించవచ్చనీ, కానీ ఖర్చు ఎక్కువవుతుందనీ చెప్పడంతో అతను అప్పటికి వీల్ చైర్ తీసుకున్నాడు. హాస్పిటల్ నుంచి మూడు వారాల తర్వాత డిస్చార్జ్ అయ్యి తన కంపెనీ వాళ్ళనుంచి 'వర్క్ ఫ్రం హోం' ఆప్షన్ తీసుకుని పని చేయడం మొదలుపెట్టాడు. మనోజ్ఞని వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళే ముందు ఆమెను ఉంచిన హాస్పిటల్ కి వెళ్ళి కలిసాడు. బాధతో, కోపంతో కనిపించిన ఆమె తల్లిదండ్రులతో పెద్దగా మాట్లాడలేదు. తమ కూతురి జీవితం నాశనమైపోయిందని బాధపడుతూ, బంధువులూ ఊళ్ళో వాళ్ళ దగ్గరా తమ పరువు ఎలా పోయిందీ చెబుతూ అతన్ని తిడుతూ మాట్లాడినా మౌనంగా విని ఊరుకున్నాడు. మనోజ్ఞతో కూడా ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు. మనసులోని భావాలన్నిటినీ గొంతుతోనే వ్యక్తం చేయడం ఎలాగో అతనికి తెలియలేదు. కేవలం ధైర్యంగా ఉండమని చెప్తూ ఆమె చేతిని తన రెండు చేతులలో తీసుకుని మృదువుగా నొక్కి వదిలేసాడు.

****************************************************************************** 

నెల రోజుల తర్వాత స్నేహితుడిని తోడుగా తీసుకుని మళ్ళీ మనోజ్ఞ వాళ్ళ ఊరు వెళ్ళాడు. మనోజ్ఞ తల్లిదండ్రులతో మనోజ్ఞని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాననీ, ఆర్య సమాజంలో రెండు వారాల తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నాననీ చెప్పాడు. తన తల్లిదండ్రులతో ఇంకా మాట్లాడలేదనీ, వాళ్ళు వస్తారో, రారో చెప్పలేననీ మీరైనా వస్తే బాగుంటుందనీ అన్నాడు. వాళ్ళు అభ్యంతరమేమీ చెప్పకుండా అలాగే వస్తామంటే 'పెళ్ళైన తర్వాత కూడా మీరు కొన్ని రోజులు మాతో ఉంటే మాకు కొంత సపోర్ట్ గా ఉంటుంది, మీరు మీ వీలు చూసుకొని చెప్పండి.' అని కోరాడు.

అతనికి గుదిబండ అవుతానేమోనన్న అనుమానం వల్లనో, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయంతోనో మనోజ్ఞ ముందు నిరాకరించబోయింది కానీ అతను 'I think we need each other now more than ever. ఈ కొత్త పరిస్థితులకి విడివిడిగా అలవాటు పడటంకన్నా కలిసి నేర్చుకోవడమే మంచిదేమో' అనడంతో మౌనంగా ఉండిపోయింది. వాళ్ళిద్దరే ఉన్నప్పుడు మాత్రం అతను 'నీకు చూపు రావడానికి యాభై శాతం అవకాశం ఉంది, కానీ నాకు మాత్రం ఎంతోకొంత వైకల్యం జీవితాంతం ఉంటుంది. అదొక్కటీ నీకు ఓకేనో కాదో ఆలోచించుకో. నువ్వు ఇంకో ఆరు నెలలు ఆగుదామన్నా పర్లేదు. మిగతా వాటి గురించి భయపడకు.' అని చెప్పాడు.

పెళ్ళి గురించి చెప్పగానే ప్రభాత్ తల్లిదండ్రులు అతడిని తిట్టిపోసారు. గుడ్డిదాన్ని చేసుకుని ఏమి సుఖపడతావన్నారు. ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకుని కాలు బాగా నయంచేసుకుని మంచి సంబంధం చూసి చేసుకోమన్నారు. బెదిరించటానికీ, భయపెట్టడానికీ ప్రయత్నించారు. కానీ అతను దేనికీ లొంగలేదు. తమ సంగతీ, చెల్లెలు సంగతీ ఏమిటని అడిగితే చెల్లెలి పెళ్ళి సంగతి తను చూసుకుంటాననీ, వాళ్ళకి తను చేయగలిగినంత చేస్తాననీ చెప్పాడు. పోనీ ఇంకొన్నాళ్ళు ఆగి ఆ అమ్మాయికి చూపు వస్తే అప్పుడు చేసుకొమ్మని చెప్తే 'పెళ్ళి అనుకున్న రోజుకే జరుగుతుంది, మీరు వస్తే బాగుంటుంది. వద్దనుకుంటే మీ ఇష్టం. కానీ మాకు మాత్రం కొత్త తలనొప్పులు తీసుకురావద్దు.' అని ఖచ్చితంగా చెప్పేసాడు.

******************************************************************************

అప్పటిదాకా తను ఫ్రెండ్స్ తో ఉన్న కాంప్లెక్స్ లోనే ఇంకొక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకున్నాడు. పెళ్ళైన తర్వాత  రెండు నెలలు మనోజ్ఞ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండి వెళ్ళారు. మనోజ్ఞ వాళ్ళు ఉన్నప్పుడే ఎలక్ట్రిక్ స్టౌవ్ మీద వంట చేయడం లాంటివి నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రభాత్ కూడా బైక్ అమ్మేసి స్కూటీ తీసుకున్నాడు. ఎవరితోడూ లేకుండా మార్కెట్ వరకు వెళ్ళి సరుకులు తీసుకుని రాగలుగుతున్నాడు.



'హే మనోజ్ఞా! ఏం ఆలోచిస్తున్నావు? ఆర్యూ ఓకే?' లాప్టాప్ లో ఆఫీస్ పని చేసుకుంటున్నవాడు తను చాలా సేపటి నుంచి సోఫాలో సైలెంట్ గా పడుకుని ఉండటం చూసి అడిగాడు.

'అయామ్ ఓకే బావా! నువ్వు పనిలో ఉన్నట్టున్నావని కదిలించలేదు.'

తన గొంతు దిగులుగా ఉన్నట్టు అనిపించడంతో 'అయిపోయిందిలే' అంటూ లాప్టాప్ పక్కన పెట్టి సోఫా దగ్గరికి వెళ్ళి మనోజ్ఞ తల ఎత్తి ఒళ్ళో పెట్టుకుని బుగ్గమీద సున్నితంగా రాస్తూ కుర్చున్నాడు.

'నేను బాగానే ఉన్నాను బావా. ఏమీ ఏడవట్లేదు.'

'గుడ్.'

'మన పెళ్ళికి ముందు రోజు బాగా ఏడ్చాను కదా. అప్పుడే గట్టిగా అనుకున్నాను, ఇంకెప్పుడూ ఈ రీజన్ వల్ల ఏడవకూడదని. రోజూ ఏడుస్తూ కుర్చుని కూడా ఉపయోగం లేదు కదా!'

'ఊ..అత్తయ్యా వాళ్ళు వెళ్ళిపోయారని దిగులుగా ఉందా?'

'కొంచెమైతే ఉంది. కానీ ఒకరకంగా అదీ మంచిదే. వాళ్ళు లేకుండా మనం ఎలా ఉండగలమో కూడా తెలుస్తుంది. ఎల్లకాలం వాళ్ళ మీదే డిపెండ్ అయిపోయి ఉండలేము కదా.'

'ఊ..'

'అత్తయ్యా మామయ్యలు ఇప్పుడు బానే మాట్లాడుతున్నారు, అవసరం అయితే వాళ్ళని పిలవచ్చుకానీ చూద్దాం.'

'ఊ..'

'నువ్వన్నట్టు మనకు కావలసిన తిండి, బట్టలు అన్నీ మనమే సృష్టించుకోలేము. అంతవరకే మనం సొసైటీ మీద ఆధారపడాల్సింది. We are on our own for the most part! వేరే వాళ్ళ మీద పెద్ద డిపెండెన్శీ లేకపోవడమే మంచిది.'

'ఊ..'
.
.
.
'ప్చ్...ఎన్నో అనుకున్నాం. ఎన్ని ఆశలు, ఎన్ని కలలుకన్నామో కదా?'
'యా. అవ్వన్నీ ఇప్పుడు నిజం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా?' ఇప్పుడు, ఇంకా అన్న పదాలని ఒత్తి పలుకుతూ అన్నాడు.

'ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ మాత్రం మనకే ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంటుంది.'

'ఏం? మనకేమైనా కొమ్ములున్నాయా? అయినా అన్నీ అనుకున్నట్టు జరిగిపోతుంటే లైఫ్ మరీ చప్పగా అయిపోతుంది. అఫ్కోర్స్, ఇప్పుడు అవసరమైన దానికన్నా మరీ చాలెంజింగ్ గా అయిపోయిందనుకో. కానీ ఇప్పుడు కూడా పాజిటివ్ వి చాలానే ఉన్నాయి. అదృష్టవశాత్తూ నాకు కాలికి తగిలింది. అదే కాలికి కాకుండా చేతికి ఏమైనా అయ్యుంటే ఉద్యోగానికి కూడా ప్రాబ్లం అయ్యేది. అప్పుడు పరిస్థితి ఘోరంగా ఉండేది. నాకు ఆ రోజు చివరగా గుర్తున్నది నువ్వు గోడ వైపు జారుతూ వెళ్ళడమే. హాస్పిటల్ లో స్పృహ వచ్చినతర్వాత నీ గురించి అడిగితే ఎవరూ ఏమీ చెప్పకపోయేసరికి చాలా భయం వేసింది. నీకు స్పృహ వచ్చి మాట్లాడగలుగుతున్నావని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను. ఆ తర్వాత నీకు సరిగా కనిపించట్లేదని తెలిసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నీకేమైనా అయ్యుంటే? మనం ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఏదీ రెండోసారి విడమరిచి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్నిసార్లు అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు. సరిగా అర్ధం చేసుకోలేని మనిషిని చేసుకోవాల్సి వచ్చుంటే? అప్పుడు పరిస్థితి ఇంతకన్నా బాగుండేదని అనుకోను. బాధని కొలవడానికి పరికరాలేమీ లేవు కదా?'

'ఊ..' సోఫాలో నుంచి లేచి ప్రభాత్ ని గట్టిగా వాటేసుకుని కుర్చుంది.

'అఫ్కోర్స్, పాజిటివ్ లే చూడాలంటే మనం ఇక్కడున్నందుకూ, ఏ ఆఫ్గనిస్తాన్లోనో, సోమాలియా లోనో లేనందుకూ కూడా సంతోషపడచ్చు.' అంటూ నవ్వాడు.

'బావా, నాకు అంతా బానే ఉండి నీకొక్కడికీ మాత్రం దెబ్బలు తగిలితే అప్పుడు కూడా ఇలాగే పెళ్ళి చేసుకుందామనేవాడివా?'

'నీకిప్పుడు ఉన్నవి చాలట్లేదా? ఈ జరగని Ifs & buts గురించి కూడా ఆలోచించి మనసు పాడు చేసుకోవాలా? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు.'

'అప్పుడు నేను నీ వెంట పడాల్సొచ్చేదా?'

'అదంతా ఇప్పుడెందుకు? ముందు ఇప్పుడు ఏమి చెయ్యాలో చూడు.'
.
.
.


'నేను ఇందాక అదే ఆలోచిస్తున్నాను బావా.ఈ దిగుళ్ళూ, భయాలను పూర్తిగా వదిలించుకోవడానికీ, ఎవరి మీదా అధారపడకుండా మన పనులన్నీ మనమే చేసుకోగలగడానికీ ఇంకో 3-4 వారాలు పడుతుందేమో. రెండుమూడునెలల్లో ఇవన్నీ దాటేసి మనం మామూలు జీవితాల్లో పడిపోతే బాగుంటుందనుకుంటున్నాను. అప్పటికి డాక్టర్లు కూడా నా పరిస్థితి ఏమిటని చెప్పగలుగుతారేమో. కానీ నాకు అమ్మా వాళ్ళు వెళ్ళిపోయినతర్వాత నువ్వు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం బోర్ కొడుతోంది. ఏంచెయ్యాలో అర్ధం కావట్లేదు.'

'యా. కానీ ఈ డాక్టర్ల గురించి - Lets hope for the best, but let's not wait for it. అంతా బానే జరిగితే మంచిదే. కానీ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అవుతాయనుకుని ప్రిపేర్ అవుదాం. లాంగ్ టర్మ్ గురించి తరువాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే కాస్త చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడటం మొదలుపెట్టు. నీకు మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్ కదా? మన కాంప్లెక్స్ లో నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ ఉన్న చిన్న పిల్లలు ఉన్నారేమో. వాళ్ళకి క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టు. నీకు కూడా కొంచెం కాలక్షేపంగా, రిలీఫ్ గా ఉంటుంది. We will go from there.'


******************************సమాప్తం******************************************

Thursday, October 12, 2017

ఒక జంట కధ

'త్వరగా పోనీ బావా! చాలా ఆకలిగా ఉంది, ఫోర్త్ బ్లాక్ కి వెళ్ళి మసాలా దోశ తిందాం!' బైక్ మీద కుర్చుంటూ అంది మనోజ్ఞ.

'అదేంటి? మధ్యాహ్నం లంచ్ సరిగ్గా చేయలేదా?' అడిగాడు ప్రభాత్ హెల్మెట్ పెట్టుకుంటూ.

'సరిగ్గా లంచ్ కి వెళ్దామనుకునే టైం కి మా మేనేజర్ వచ్చి ఏదో ఇంపార్టెంట్ పని, వెంటనే చెయ్యాలని చెప్పి వెళ్ళాడు. అది కంప్లీట్ చేసి వెళ్ళేసరికి కాఫిటేరియాలో అన్నీ అయిపోయాయి. నా ఆకలి కూడా చచ్చిపోయింది. ఏదో కొంచెం తినాలని తిని వచ్చేసాను.'

'భోజనం కూడా సరిగా చేయకుండా పనేంటి? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా? ఆయినా ఇలాంటి చిన్న కంపెనీలలో ఇలాగే ఉంటుంది. వచ్చే డబ్బులు తక్కువ, జాబ్ సెక్యూరిటీ కూడా తక్కువే. పై వాళ్ళు చెప్పింది వెంటనే చెయ్యకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కొంచెం ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయితే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాంటిదేదైనా చూసుకొని తొందరగా మారిపో' కొంచెం కోపంగా, కొంచెం బాధగా అన్నాడు.

'జాయినై మొన్నేగా సంవత్సరం అయ్యింది. ఇప్పుడే మారిపోతే మరీ ఫ్రెషర్ లాగా చూస్తారు. ఇంకో సంవత్సరం తర్వాత అయితే శాలరీ కూడా ఎక్కువ వస్తుంది, అప్పుడు మారతాలే'

'అందుకే "A stitch in time saves nine" అన్నారు. చదువుకునే టైంలో సరిగా చదివుంటే ఈ కష్టాలన్నీ ఉండేవి కాదు.' కొంత నిష్టూరంగా అన్నా చిరునవ్వుతో అన్నాడు.

'అహా! నీ లాగా గొప్ప కాలేజ్ లో చదవలేదు కానీ నేనూ మంచి కాలేజ్ లోనే, బాగానే చదివాను. మా అదృష్టం బాగుండక స్లో డౌన్ వల్ల కాంపస్ లో రాలేదు. రెండేళ్ళ ముందు నీ బాచ్ లో అయితే నాకు కూడా డీసెంట్ కంపెనీ లో వచ్చుండేది.'

'స్లోడౌన్ విషయం కరెక్టే కానీ అట్లాంటి పరిస్థితులలో కూడా మీ బాచ్ టాపర్లకి మంచి జాబ్సే వచ్చాయికదా? అయినా నువ్వు మాత్రం తిండి తిప్పలు మానేసి ఇలా పని చేస్తూ కుర్చోకు.' బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు.

******************************************************************************

ఫోర్త్ బ్లాక్ కి వచ్చి మనోజ్ఞకి బాగా ఫేవరెట్ అయిన రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు.

'బావా! నేను కూడా ఆ అమ్మాయిలాగా అలా అటో కాలు ఇటో కాలు వేసుకుని కుర్చుంటే?' బైక్ దిగి ప్రక్కనుంచి బండి మీద హత్తుకుని కూర్చుని వెళ్తున్న ఒక జంటని చూస్తూ కొంటెగా అంది.

'నీ ఇష్టం! నీకు ఎలా కంఫర్టబుల్ గా అనిపిస్తే అలా కుర్చో' రెస్టారెంట్ లోకి నడుస్తూ అన్నాడు.

'అలా కుర్చుంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని '

'నీకు కంఫర్టబుల్ గా ఉండటమే నాక్కావలిసింది. అయినా ఇలా చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడిపోయే స్టేజ్ లో లేను! సరే కానీ, మసాలా దోశ ఒకటే చాలా, ఇంకేమైనా తింటావా?'

'ఉహూ, ఇంకేమీ వద్దు. ఇద్దరికీ చెరొక దోశ తీసుకురా చాలు.'

'ఓహో! నేను కూడా నీకు నచ్చిందే తినాలా?' సరదాగా అంటూ నవ్వాడు.

'ఇక్కడ దోశ బావుంటుందని అన్నాను బాబూ. అఖ్ఖర్లేకపోతే నీకు కావల్సింది తెచ్చుకుని తిను.' ఉడుక్కుంటూ సమాధానం ఇచ్చి ఖాళీగా ఉన్న ఒక టేబుల్ చూసి వెళ్ళి కుర్చుంది.


'అదేంటీ? నువ్వు కూడా మసాలా దోశ తెచ్చుకున్నావు?' ఐదు నిమిషాల తర్వాత రెండు ప్లేట్స్ లో మసాలా దోశలు తీసుకువస్తున్న ప్రభాత్ ని చూసి ఆశ్చర్యంగా  అంది.

'ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే మా మరదలు ఇవ్వాళ కొంచెం నీరసంగా, డల్ గా ఉన్నట్టు అనిపించి ఇలా అయినా కొంచెం చీర్ అప్ అవుతుందేమో అని ' ఆప్యాయంగా అంటూ మనోజ్ఞకి ఎదురుగా కుర్చున్నాడు.

'థాంక్స్ బావా! కానీ నీకు కావల్సింది తెచ్చుకోవాల్సింది.' నొచ్చుకుంటూ అంది.

'ఇట్స్ ఓకే! ఇ యాం ఫైన్ విత్ దిస్. ఇంకేమిటి సంగతులు?'

'నథింగ్ స్పెషల్ బావా. ఆఫీస్ లో గత మూడు వారాలుగా కొట్టుకుంటున్న నా వర్క్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో, వచ్చేవారం కొంచెం ఫ్రీ. మా కొలీగ్ దగ్గర మంచి టెక్నికల్ బుక్ ఒకటి ఉంటే తీసుకున్నాను. వీకెండ్ లో చదవాలి. హే, ఇంతకీ మొన్న చూసిన సినిమా ఎలా అనిపించింది? మూవీ అయిపోగానే ఇద్దరం హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అసలు మాట్లాడటమే కుదర్లేదు.'

'ఏదో ఏడిచింది. నీకు నచ్చిందా?'

'కొన్ని చోట్ల మరీ ఓవర్ గా అనిపించింది కానీ కొన్ని కొన్ని చోట్ల బాగా నచ్చింది. ఓవరాల్ గా ఓకే. నీకేం నచ్చలేదు? చాలా మందికి విపరీతంగా నచ్చేసిందిగా?'

'అంటే మిగిలిన చెత్త తెలుగు సినిమాలతో కంపేర్ చేసి 'జీరో కాకపోతే చాలు హీరోనే' అనే స్టేజ్ కి వచ్చేసినట్టున్నారు. నాకసలు నచ్చే సినిమాలే చాలా తక్కువ, నువ్వు వెళ్దామన్నావని వచ్చాను!'

'బావా, ఆ సినిమాలో చూపించినట్టు అబ్బాయిలకి ఎవరైనా అమ్మాయి నచ్చితే వెంటనే ఫిజికల్ గా కూడా అడ్వాన్స్ అయిపోవాలనిపిస్తుందా?'

'నువ్వు ఆ సినిమా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు?'

'అదేం లేదు, జనరల్ గా అడిగానంతే. ముందు నువ్వు చెప్పు.'

'చాలా మందికి అనిపిస్తుందనుకుంటా.'

'మరి...'

'మరి??' ఆశ్చర్యంగా చూసాడు.

'అదే, మరి నీకెప్పుడూ అలా అనిపించలేదా?'

'ఎవరిని? నిన్ను చూస్తేనా, వేరే వాళ్ళని చూస్తేనా?'

'ఓహో, వేరే వాళ్ళని చూసినా అనిపిస్తుందా?'

'నీ క్వొశ్చన్ ఏమిటి అని అడుగుతున్నాను.'

'నువ్వెప్పుడూ నాతో అలా అడ్వాన్స్ అవ్వటానికి ట్రై చేయలేదు కదా అని.'

'నువ్వు సీరియస్గా ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. దానికంత సీన్ లేదు.'

'అబ్బా, చెప్పు బావా'

'ఏం చెప్పాలి? ఒకడు తను చూసిన ప్రపంచాన్ని బట్టి తన లెవల్లో ఒక కధ రాస్తాడు. దాన్ని ఒక డైరెక్టర్ జనాలకి నచ్చే విధంగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి ఒక హీరో, ఇంకా కొంతమంది వాళ్ళకు తోచిన విధంగా నటించి ఆ కధకి జీవం పోయడానికి ప్రయత్నిస్తారు. ఒక వెయ్యి సినిమాలు తీస్తే వాటిల్లో ఒకటి రెండిట్లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండి బాగా సింక్ అవుతాయి. అవితప్ప మిగితా సినిమాలన్నిటి గురించి సీరియస్ గా ఆలోచించేసి మన జీవితాలకి అన్వయించుకొని తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు.'
.
.
.
'see, హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం వరకు అయితే పర్లేదు కానీ అన్నీ ముందే చేసేసి, పిల్లల్ని కూడా కనేసి ఆ తర్వాత పెళ్ళి చేసుకునేటట్టయితే ఇంక ఆ పెళ్ళి చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత?' మౌనంగా తనవంకే చూస్తూ ఉన్న మనోజ్ఞ ని చూసి మళ్ళీ అతనే అన్నాడు.

'ఊహూ'

'నీ సందేహనివృత్తి అయిందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?' చిరునవ్వుతో అన్నాడు.

'మరి వేరే అమ్మాయిల్ని చూస్తే?'

'ప్చ్..సహజంగానే కొంచెం ఎట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అమ్మాయి బాగుంటే చూడాలనిపిస్తుంది. మరీ బాగుంటే రెండోసారి చూస్తాను. కానీ అది జస్ట్ చూడటం వరకే. అలా బాగున్న అమ్మాయి ఎవరైనా నిజంగానే బెడ్ రూం దాకా వచ్చిందే అనుకో. ఎవరూ రారు..మాటవరసకి చెప్తున్నాను, వచ్చిందనుకో..మరీ మొహం మీద తలుపేసి గెటౌట్ అనలేం కదా. "నీకు కావసినంత సేపు కుర్చో తల్లీ. నువ్వెళ్ళిపోయాక వస్తాను" అని చెప్పొస్తాను.'
.
.
'ఎవరికైనా షేక్ హాండ్ ఇవ్వాల్సి వస్తేనే "వీళ్ళు ఎంత నీట్ గా ఉన్నారో" అనే అనుమానం వస్తుంది. అలాంటిది ముద్దు పెట్టుకోవడం లాంటి ఇంటిమేట్ వి ఎవరితో పడితే వాళ్ళతో ఎలా చేస్తాం?'మళ్ళీ అతనే అన్నాడు.

'మరి డాక్టర్లు, సైకియాట్రిస్టులు కూడా అబ్బాయిలు అలాగే ఉంటారు ఏవో హార్మోన్ల వల్ల అంటారు?'

'వాళ్ళకి తెలిసింది అంతే అయ్యుంటుంది. లుక్, చాలా మంది అలాగే ఉంటారు, కానీ అందరూ కాదు.'

ఇంకా ప్రభాత్ కళ్ళలోకే చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ.

'నీ బాధేమిటో నాకు అర్ధం కావట్లేదు. ప్రస్తుత సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే అలా అనిపించకపోవచ్చు కానీ మానం, శీలం అనే పదాల మీద ఆడవాళ్ళకేమీ కాపీరైట్ లేదనుకుంటా!'

'నాకు ప్రాబ్లమేమీ లేదు బావా. కొత్త విషయాలు తెలుసుకోవడానికీ అర్ధం చేసుకోవడానికీ ప్రయత్నిస్తున్నానంతే. మొత్తానికి మంచి అబ్బాయిని అంటావ్?' నవ్వుతూ కవ్విస్తున్నట్టుగా అంది.

'మంచో చేడో. కొంతమందికి చేతగానితనంగా అనిపించవచ్చు. నేనైతే ఇంతే.'

'నాకు తెలుసులే బావా. నిన్ను జస్ట్ ఏడిపిద్దామని అన్నాను. కాసేపు అలా నడుస్తూ మాట్లాడుకుందాం.' ప్లేట్ లో చేతులు కడుక్కుంటూ అంది.

'ఓకే. ప్లేట్స్ నేను సింక్ లో పడేస్తాలే' అంటూ ఆమె ప్లేట్ కూడా తీసుకున్నాడు.

******************************************************************************

రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి చేతిలో చెయ్యేసి పట్టుకుని మార్కెట్ కాంప్లెక్స్ లో నడవటం మొదలుపెట్టారు.

'మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మొత్తానికి మంచి ప్రేమికుడు కదా?'

'నువ్వింకా ఆ సినిమాలో నుంచి బయటికి రాలేదా?'

'మంచి విషయాలు మాట్లాడుకోవచ్చులే బావా'

'హుమ్...అంతేనంటావ్'

'కాదా?'

'ఏమో. ఆ సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా ఆ మాటకొస్తే మన చుట్టూ ఉన్నవాళ్ళైనా ఈ ప్రేమ అనే బ్రహ్మపదార్ధం వాళ్ళకి అర్ధంకాదో లేక నాకే అర్ధం కాదో నాకు తెలియదు.'

'అంటే?'

'ఇప్పుడు ఆ హీరో ఉన్నాడు..or anybody for that matter. వాడికి ఒక అమ్మాయి నచ్చుతుంది. లవ్ ఇన్ ఫస్ట్ సైట్ లాంటిదైతే మరీ కామెడీ. ఆ అమ్మాయికీ వాడు నచ్చుతాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకుందామనుకుంటారు. అవసరమైతే తల్లిదండ్రులనీ సమాజాన్నీ ఎదిరించైనా పెళ్ళి చేసుకుందామనుకుంటారు. ఒక్కోసారి దానికోసం చంపడానికైనా చావడానికైనా సిధ్ధపడతారు.' అని మనోజ్ఞ కళ్ళలోకే చూస్తూ ఆగాడు.

'అంతవరకూ బానే ఉంటుంది. Lets say, పెళ్ళికి ముందురోజు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఆ అమ్మాయికి మొహం కాలిపోవడం లాంటిది ఏమైనా జరుగుతుందనుకో, అప్పుడు కూడా పెళ్ళి చేసుకుంటాడా? నాకు తెలిసి నూటికి ఒక్కడైనా అలా చేయకపోవచ్చు. ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకైనా వర్తిస్తుంది. మరి అప్పటిదాకా చెప్పిన ప్రేమ అవ్వన్నీ ఏమైపోతాయో?'
.
.
'అదే ఆ యాక్సిడెంట్ పెళ్ళైన మర్నాడు జరుగుతుందనుకో, అప్పుడు డైవోర్స్ తీసుకుంటారా? తిట్టుకుంటూ జీవితం మొత్తం గడిపేస్తారేమో కానీ కనీసం సగం మందైనా విడాకులు తీసుకునే సాహసం చేయకపోవచ్చు, ఒకవేళ తీసుకుందామన్నా కేవలం ఆ రీజన్ వల్లే అయితే కోర్టులు ఒప్పుకోవేమో. ఏదేమైనా సగం మంది అసలు అక్కడి దాకా వెళ్ళకపోవచ్చు.'

మనోజ్ఞ ఆలోచిస్తూ అక్కడే నుంచుండిపోయింది.

'అదే యాక్సిడెంట్ పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత జరిగితే? పదేళ్ళ తర్వాత అయితే? ఇరవై ఏళ్ళ తర్వాత? అప్పుడు చాలామంది పెద్దగా ఫీల్ కూడా అవ్వకపోవచ్చు. యు సీ? ఒక స్టేజ్ తర్వాత ఆ దెబ్బ తగిలిన వ్యక్తి కంటే రెండోవాళ్ళే ఎక్కువ బాధపడతారేమో. ఈ మొత్తం వ్యవహారంలో ప్రేమ ఎప్పుడు మొదలౌతుందని వాళ్ళు అనుకుంటారు? అది నిజంగా ఎప్పుడు మొదలవుతుంది? ఏ స్టేజ్ లో ప్రేమ పార్ట్ ఎంత, వేరే కారణాల పార్ట్ ఎంత?' తనలో తానే అనుకున్నట్టుగా అన్నాడు.
.
.
'అందుకనేనా బావా నువ్వు నాకెప్పుడూ "ఐ లవ్ యు" అని కూడా చెప్పలేదు?' రెండు మూడు నిమిషాల తర్వాత సాలోచనగా అంది మనోజ్ఞ.

మాట్లాడటం ఆపేసినా ఇంకా ఆలోచనలనుంచి తేరుకోని ప్రభాత్ అది వినగానే కొంచెం ఆశ్చర్యపోయాడు.

'దాని గురించి చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది కానీ దట్స్ ఏ గుడ్ క్వశ్చన్.' అన్నాడు చివరికి.

ఇద్దరూ ఆలోచనల్లో మునిగిపోయి మౌనంగా అలా నడుస్తూ ఉన్నారు.

'కాసేపు ఆ బెంచ్ మీద కుర్చుందాం' ఒక చెట్టు కింద ఖాళీగా ఉన్న బెంచ్ ని చూపిస్తూ అంది మనోజ్ఞ కొన్ని నిమిషాల తరువాత.

'సరే. ఇంక ఆ సినిమా గోల వదిలేసి ఇంకేమైనా మాట్లాడుకుందాం'


'ఇంతకీ ఎందుకు ఇవాళ దిగులుగా ఉన్నావు?' బెంచ్ మీద కుర్చుని మనోజ్ఞ భుజం మీద చెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.

'ఏమో! ఆఫీస్ వర్క్, ఇంకా మిగతావాటి వల్ల కొంచెం చికాకుగా అయితే ఉంది...టైం ఎంతయ్యింది? నా వాచ్ కూడా సరిగ్గా పని చెయ్యట్లేదు. దీని సర్వీస్ అయిపోయిందేమో.'

'సెవెన్ థర్టీ. కొత్తది కొనుక్కో, అయినా నీకేంటి చెప్పు.' నవ్వుతూ అన్నాడు.

'నీలా కష్టాలు పడకపోయి ఉండచ్చు కానీ నేనేమీ సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు బాబూ! అవును, డబ్బులంటే గుర్తుకు వచ్చింది, రాత్రి నాన్నగారు ఫోన్ చేసారు.'

'అహా! ఎలా ఉన్నారు? ఏమంటున్నారు?'

'బానే ఉన్నారు...మామూలే! నేను నాన్నతో మాట్లాడి రెండురోజులయింది, మొన్న చేసినప్పుడు ఆయన బయటకి వెళ్ళారు. అందుకని నిన్న ఆయనే చేసారు.'

'మరి డబ్బులంటే ఆయన గుర్తుకురావడం ఏంటి?'

'ఏమో బావా! నాతో ఏమీ అనలేదు కానీ ఆయన నా పెళ్ళి, కట్నాలు వాటి గురించి దిగులు పడుతున్నారేమోనని అనిపిస్తోంది.'

'ఇప్పుడు కట్నాల ప్రస్తావన ఎందుకొచ్చింది?' కొంచెం సీరియస్ గా మనోజ్ఞ కళ్ళల్లోకే చూస్తూ అడిగాడు.

'అంటే, ఇప్పుడు వాళ్ళకి మన గురించి కొంచెం ఐడియా అయితే ఉంది. కానీ అత్తయ్య అప్పుడెప్పుడో వదిన పెళ్ళిలో, అప్పటికి మనకి అంత పెద్దగా పరిచయం కూడా లేదనుకో, అప్పుడు అత్తయ్య అమ్మతో మాట్లాడుతూ 'ఉన్న ఆస్తంతా ముగ్గురు పిల్లల చదువులకీ పెద్దదాని పెళ్ళికే అయిపోయింది, ఇంక వాడి పెళ్ళికొచ్చే కట్నంతోనే చిన్నదాని పెళ్ళి చెయ్యాలి.' అందిట. అందుకని నాన్న ఇప్పుడు టెన్షన్ పడుతున్నారనిపిస్తోంది. ఎంతైనా అమ్మ, మామయ్యలు కజిన్సే కానీ సొంత అన్నాచెల్లెళ్ళు కాదు కదా. మంచి ఉద్యోగమనేకానీ నాన్నకైనా వెనకాల ఆస్తులులేవు, ఇప్పుడు నీ రేంజ్ కి తగ్గట్టు లక్షల్లో కట్నమంటే భయపడుతున్నారనుకుంటా.'

'మరి నువ్వేమన్నావు?'

'ఇది నా ఫీలింగ్ అంతే! నాన్నగారు నాతో దీనిగురించి డైరెక్ట్ గా ఎప్పుడూ మాట్లాడలేదు.'

'కట్నం గురించి నేను చూసుకుంటాను గానీ మామయ్యని ఎక్కువ టెన్షన్ పడద్దని చెప్పు.'

'కానీ అత్తయ్య పాయింట్ కూడా కరెక్టే కదా, మీ చెల్లెలి పెళ్ళికైనా డబ్బులు కావాలి కదా?'

'దానికింకా ఎలాగో 3-4 ఏళ్ళు టైం ఉంది, ఈ లోపల అంత సంపాదించగలననే అనుకుంటున్నా. అయినా నేను దానికి కూడా గట్టిగా చెప్పాను ఈ పెళ్ళి, కట్నాల గురించి ఆలోచించకుండా ముందు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోమని. దానికి మంచి జాబ్ వస్తే అప్పుడు ఈ గోలంతా ఉండకపోవచ్చు.'


'పోనీ మనం తన పెళ్ళి దాకా ఆగి ఆ తర్వాత చేసుకుంటే? ఆప్పటికి నేను కూడా కొంచెం సేవ్ చేయగలనేమో! ఇబ్బంది లేకుండా ఉంటుంది.'

'అప్పటిదాకా నిన్ను ఇలా చూస్తూ ఉండమంటావా? నా వల్లకాదు. అయినా అంత అవసరం కూడా లేదు.'

'ఏమో! అనవసరంగా మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది.'

'సీ, నేను ఈ మూడు నాలుగేళ్ళలో సంపాదించింది 12 లాక్స్ దాకా ఉంది. లాస్టియర్ మూడునెలలు అమెరికా వెళ్ళడం వల్ల ఐదు లక్షల దాకా సేవ్ అయింది. ఈ ఇయర్ కూడా అలాంటి ట్రిప్ ఉండచ్చు. ముందు  అమ్మావాళ్ళకోసం ఊళ్ళో పది పన్నెండు లక్షలు పెట్టి ఇల్లు తీసుకుందామని ప్లాన్. వాళ్ళూ పెద్దవాళ్ళైపోతున్నారు, ఇప్పుడైనా సొంత ఇంట్లో ఉంటే బాగుంటుందని. ఇంకో సంవత్సరం లోపల ఇక్కడ మనకి కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలని టార్గెట్. రెంట్ కట్టే బదులు ఇంకో పదివేలు వేసుకుంటే EMI అయిపోతుంది. ఇవి కాకుండా ఇంకో 3-4 ఏళ్ళలో చెల్లి పెళ్ళికి కావలసింది సంపాదించవచ్చనే అనుకుంటున్నా. జీతాలు కూడా పెరుగుతుంటాయి కదా. చూద్దాం ఇంకో సంవత్సరం తర్వాత ఎలా ఉంటామో. కావాలంటే అప్పుడే అపార్ట్మెంట్ ప్లాన్ పోస్ట్పోన్ చేయొచ్చు.'

'ఏమో బావా! నాకు ఇంకా కొంచెం భయంగానే ఉంది.'

'భయమెందుకు చెప్పు? అమ్మ వైపు నుంచి కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, ఏమైనా తేడా వస్తే ఫ్యూచర్ లో కొంత డబ్బు సమస్యలు రావచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఇవ్వన్నీ మనం సాల్వ్ చేసుకోగలిగినవి.'

'బావా, అత్తయ్య ఒప్పుకోకపోతే? కట్నం విషయంలో సమస్యలొస్తే?'

'కట్నం గురించి అయితే మాత్రం నో డిస్కషన్, అంతే! చెల్లి పెళ్ళి బాధ్యత నాది, మీరు భయపడకండి అని చెప్తాను. వేరే ఏవైనా కారణాల వల్ల ఒప్పుకోకపోతే ఒప్పించటానికి ట్రై చేద్దాం. అప్పటికీ కుదరకపోతే ఇంక చేయగలిగిందేమీ లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్నాలేక పోయినా వాళ్ళు నెమ్మదిగానైనా ఎడ్జస్ట్ అవ్వాల్సిందే.'

'చెప్పినంత సులువు కాదేమో బావా చేయడం.'

'అధిగమించలేనంత పెద్ద సమస్యలని కూడా అనుకోను. ఇదొక్కటేనా సమస్య? దీనితో అయిపోదు కదా? చూద్దాం, రేఫు పెళ్ళి అయిన తర్వాత ఎన్ని వస్తాయో. ఏదేమైనా మనం కలిసి ఆలోచించి చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయచ్చు. We just need to stay strong. అసలు ఈ ఆన్సైట్ ట్రిప్ సంగతి ఏదో తేలితే అమ్మా, నాన్న, మామయ్య వాళ్ళందరితో మన పెళ్ళి గురించి మాట్లాడదామనుకుంటున్నాను. అఫ్కోర్స్, ఎవరికీ షాక్ అయితే కాదు. పెళ్ళి చేసుకుంటే కష్టమో సుఖమో ఇద్దరం కలిసే అనుభవించవచ్చు.'

పెళ్ళి మాట వినగానే మనోజ్ఞ కళ్ళల్లో మెరుపులు వచ్చేసాయి. పెదవుల మీద చిరునవ్వు కూడా అప్రయత్నంగానే వచ్చేసింది. ప్రభాత్ నే చూస్తూ ఉండిపోయింది.
.
.
'నీకు ఎంతైనా నీ మీద కాన్పిడెన్స్ ఎక్కువ కదా బావా? ఇలా ఉన్నప్పుడే మరీ ముద్దొచ్చేస్తావు..' రెండు చేతుల్తో అతని బుగ్గలు పట్టుకుని పిండేస్తూ అంది మురిపెంగా.

' ఏ, నీకు లేదా కాన్పిడెన్స్? నిజానికి నాకు నా మీద కన్నా కొన్ని విషయాల్లో నీ మీదే నమ్మకం ఎక్కువ.'

'ఉందనుకో. కానీ నీ కాన్పిడెన్సే నాకు బాగా నచ్చుతుంది.'

'అవునా? నాకు నీలో అన్నీ నచ్చుతాయి. రోజూలా కొట్టినట్టు మాట్లాడకుండా ఈ రోజు కొంచెం బేలగా మాట్లాడుతున్నా క్యూట్ గానే ఉన్నావు.'  దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.

'అబ్బా, అది నచ్చుతుంది అంటే అదొక్కటే నచ్చుతుందని కాదు బావా. నాకు కూడా నీలో అన్నీ నచ్చుతాయి. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం.'

'థాంక్స్ పిల్లా. కానీ నాకు మా మరదలంటే ఇంకా ఎక్కువ ఇష్టం.'

'నాకు మా బావంటే ప్రేమ కూడా!' కొంటెగా అన్నా కళ్ళల్లో ప్రేమ నిజంగానే కనిపిస్తూ ఉంది.

'తెలివితేటలకి సంతోషించాంలే కానీ, ఇంతకీ నువ్వెందుకు ఇవ్వాళ డల్ గా ఉన్నావు? రోజూ గలగలా మాట్లాడేదానివి ఇవాళ సైలెంట్ గా ఉండి నాతోనే వాగిస్తున్నావు. పెళ్ళి గురించే అయితే ఎక్కువగా ఆలోచించి కంగారుపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది.'

'పెళ్ళి గురించే కాదులే బావా. మనం దీని గురించి ఎప్పుడూ డీటైల్డ్ గా మాట్లాడుకోలేదు కానీ, నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందనుకున్నాను. నీ గురించి నాకు తెలియదా!!' అతని బుగ్గని పట్టుకుని ఊపేస్తూ అంది.

'మరి?'

'ఏమీ లేదు. అయినా అబ్బాయిలకి ఏమీ అర్ధం కాదులే.' నెత్తి మీద చిన్నగా మొట్టికాయ వేసింది.

'ఏదో ఒకటి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండటమే నాకు కావాల్సింది.'

'ఉంటాన్లేకానీ టైం ఎంతైంది?మరీ లేట్ అయిపోతున్నట్టుంది.'

'యా. మీ హాస్టల్లో ఫుడ్ అయిపోయేలోపు వెళ్తే బెటర్. నువ్వు దోశ తిన్నాను కదా అని మళ్ళీ డిన్నర్ మానేయకు.' జేబులో నుంచి సెల్ ఫోన్ తీస్తూ అన్నాడు.

'తింటాలే కానీ అసలు మంచి ఫుడ్ తిని చాలా రోజులయింది. బావా, రేపు లంచ్ కి నందినీకి వెళ్దాం.'

'హే. రవి కూడా వీకెండ్ కి వాళ్ళ ఊరు వెళ్తున్నాడట.' ఫోన్ లో పాప్ అయిన మెసేజ్ చూస్తూ అన్నాడు.

'నీ మిగతా ఇద్దరు రూమ్మేట్స్ కూడా వెళ్ళిపోయారు కదా? ఇంక నువ్వొక్కడివేనా వీకెండ్ అంతా?'

'యా. ఒక్కడినే. నువ్వు రావచ్చుగా? మీ హాస్టల్ కి వెళ్ళి నీకు కావల్సిన బట్టలు తెచ్చుకో.'

'ఊహూ. నాకు పనులున్నాయి. రేపు బట్టలు ఉతుక్కోవాలి. అస్సలేమీ లేవు.'

'పోనీ అవి కూడా తెచ్చుకో. అక్కడే ఉతుక్కోవచ్చు.'

'సర్లే. అబ్బాయిల బాత్రూంలో రెండు నిమిషాలు ఉండటమే కష్టం. అక్కడే ఉండి బట్టలు ఉతికితే వాంతొస్తుంది.'

'హుమ్మ్.'


'ఒక పని చేద్దాం. నేను రేపు పొద్దున్నే హాస్టల్లో బట్టలు ఉతుక్కుంటాను. నువు లంచ్ టైం కి వచ్చేయ్, ఇద్దరం నందినీ లో తినేసి అక్కడినుంచి మీ రూం కి వెళ్దాం. నీకు రేపూ ఎల్లుండిలలో వేరే ఏమైనా పనులున్నాయా?'

'రేపు ఒక రెండు గంటలు ఆఫీస్ పని ఉంది. అది లంచ్ లోపు అయిపోతుంది.'

'ఊహూ. నువ్వా పనేదో మధ్యాహ్నం చేసుకో. నేను అప్పుడు చదువుకుంటాను. రాత్రికి ఉప్మా చేసుకుందాం. దానికి కావాల్సినవన్నీ మీ రూం లో ఉన్నాయో లేదో చూసి లేకపొతే పొద్దున్నే కొని ఉంచు.'

'అలాగే.'

'అండ్ మీ హాల్, కిచెన్ పొద్దున్నే కాస్త క్లీన్ చెయ్యి. బాత్రూం కూడా. మనుషులెవరైనా దాంట్లోకి వెళ్ళగలిగేటట్టు ఉంచు.'

'రేపు పెళ్ళయ్యాక కావాలంటే నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని మనింట్లో బాత్రూం లు నీట్ గా, నీకు నచ్చినట్టు ఉంచుతాను కానీ, ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. పనమ్మాయితో చెప్పి రేపు పొద్దున్న వీలైనంత వరకు క్లీన్ చేయిస్తాను.'

'అసలు అంత డర్టీ గా ఎలా ఉండగలుగుతారో? పనమ్మాయి ఉన్నా చెప్పి చేయించుకోవడం కూడా రాదు.'

'సరే, నేనొక్కడినే కాదు కదా ఉండేది. అయినా ఇంక తిట్టడం ఆపేస్తావా? నువ్వు మళ్ళీ నీ ఫాం లోకి వచ్చేస్తున్నావు.'

'హహహ..అదేమీ లేదు కానీ వీలైతే ఏదైనా మంచి మూవీ డౌన్లోడ్ చెయ్యి. రేపు సాయంత్రం చూద్దాం.'

'ట్రై చేస్తాను.'

'ట్రై చేయడం కాదు. చెయ్యి. అసలు రేపు సాయంత్రం వెదర్ బాగుంటే కాసేపు బయట తిరుగుదాం.'

'సరే.'

'ఇంక వెళ్దామా? నేను కూడా తొందరగా తినేసి కాసేపు చదువుకుంటాను. ఇవాళ రేపు కలిపి సగం అన్నా అవుతుందేమో.'

'వెళ్దాం. నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి నేను కూడా ఏదో ఒకటి చేసుకుని తినాలి.'


నడుస్తూ, కబుర్లు చెప్పుకుంటూ బైక్ పార్క్ చేసిన చోటుకి వచ్చారు.


'బావా, ఇవాళ నేను కూడా నిన్ను వాటేసుకుని కుర్చోబోతున్నాను.' చిలిపిగా అంది.

'నీ ఇష్టం. కానీ మీ కొలీగ్స్ ఎవరైనా చూస్తే 'మనోజ్ఞ మంచి అమ్మాయి ' అనే ఇంప్రెషన్ పోతుందేమో?'

'నా ఇమేజ్ కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా ఐ డోంట్ కేర్.'

'గుడ్. కానీ జాగ్రత్తగా కుర్చో.' బైక్ మీద కుర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాడు.

' ఈ చున్నీ ఎక్కడ పెట్టుకోవాలో' అతని వెనకాల కుర్చుని సర్దుకుంటూ సందేహంగా అంది.

'ఎక్కడైనా పెట్టుకో. డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం నా మొహం మీదా, బైక్ చక్రం లో పడకుండా చూడు.' అంటూ నవ్వాడు.


అక్కడినుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ లో కిలో మీటర్ దూరం వెళ్ళటానికే పదిహేను నిమిషాలు పట్టింది. ఆ తర్వాత చీకటిగా ఉన్న ఒక సందులో ట్రాఫిక్ తక్కువగా ఉండటం చూసి తొందరగా వెళ్ళొచ్చని బైక్ ఆ సందులోకి తిప్పి కొంచెం స్పీడ్ పెంచాడు.
.
.
.

టక్ టక్ టక్
.

'ఆ సౌండ్ ఏంటి?' కంగారుగా అడిగాడు.
.

హెల్మెట్ పెట్టుకుని ఉండటం వల్ల అతని మాటలు ఆ అమ్మాయికి వినిపించలేదు.
.

'హేయ్. ఆ సౌండ్ ఏంటి? నీ చున్నీ ఎక్కడ పెట్టావు?' కంగారుగా అంటూ లిప్తపాటులో వెనక్కి తిరిగి చూసి ముందుకి తిరిగేసరికి ఎడమవైపు సందులో నుంచి సడన్ గా తిరిగి ఎదురుగా రాంగ్ రూట్ లో హెడ్ లైట్స్ లేకుండా ఫాస్ట్ గా వస్తున్న ఆటో కనిపించింది. తప్పించేలోపలే ఆటో వచ్చి గుద్దేయటం అతను గాల్లోకి ఎగరటం జరిగిపోయాయి.

రోడ్ మీద పడగానే మనోజ్ఞ వైపు చూడటానికి ప్రయత్నించాడు. బైక్ కింద ఇరుక్కుని రోడ్ పక్కన ఉన్న గోడ వైపు స్లైడ్ అవుతూ ఉన్న మనోజ్ఞ కనిపించింది.

'మనో..' అరిచేలోపే రోడ్ కి ఆపోజిట్ సైడ్ నుంచి తన మీదకే వస్తున్న కార్ కనిపించింది.

(సశేషం..)