Monday, October 16, 2017

ఒక జంట కధ - II



Link for Part-I


తలకి బలమైన గాయాలు కావడంతో మనోజ్ఞ కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు  సర్జరీలు చేసి స్పృహలోకి తెప్పించగలిగారు కానీ ఆప్టికల్ నెర్వ్స్ దెబ్బతినడం వల్ల కంటిచూపు  పూర్తిగా పోయింది. మళ్ళీ చూపురావడానికి యాభై శాతం మాత్రమే అవకాశముందనీ,  గాయాలు పూర్తిగా మానినతర్వాత పరీక్షలు చేస్తేగానీ ఖచ్చితంగా చెప్పలేమనీ, అందుకు ఐదారు నెలలు పట్టొచ్చనీ డాక్టర్లు చెప్పారు. నాలుగు వారాల తర్వాత హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ చేస్తే తన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని వాళ్ళ ఊరు తీసుకుని వెళ్ళిపోయారు.

ఎడమకాలి మీద నుంచి కార్ వెళ్ళడంతో ప్రభాత్ కాలి ఎముకలు విరిగిపోయి మోకాలి క్రింది భాగం తీసేయాల్సి వచ్చింది. గాయాలు పూర్తిగా మానిన తర్వాత ప్రాస్తెటిక్ లెగ్ లాంటివి ప్రయత్నించవచ్చనీ, కానీ ఖర్చు ఎక్కువవుతుందనీ చెప్పడంతో అతను అప్పటికి వీల్ చైర్ తీసుకున్నాడు. హాస్పిటల్ నుంచి మూడు వారాల తర్వాత డిస్చార్జ్ అయ్యి తన కంపెనీ వాళ్ళనుంచి 'వర్క్ ఫ్రం హోం' ఆప్షన్ తీసుకుని పని చేయడం మొదలుపెట్టాడు. మనోజ్ఞని వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళే ముందు ఆమెను ఉంచిన హాస్పిటల్ కి వెళ్ళి కలిసాడు. బాధతో, కోపంతో కనిపించిన ఆమె తల్లిదండ్రులతో పెద్దగా మాట్లాడలేదు. తమ కూతురి జీవితం నాశనమైపోయిందని బాధపడుతూ, బంధువులూ ఊళ్ళో వాళ్ళ దగ్గరా తమ పరువు ఎలా పోయిందీ చెబుతూ అతన్ని తిడుతూ మాట్లాడినా మౌనంగా విని ఊరుకున్నాడు. మనోజ్ఞతో కూడా ఎలా మాట్లాడాలో అర్ధం కాలేదు. మనసులోని భావాలన్నిటినీ గొంతుతోనే వ్యక్తం చేయడం ఎలాగో అతనికి తెలియలేదు. కేవలం ధైర్యంగా ఉండమని చెప్తూ ఆమె చేతిని తన రెండు చేతులలో తీసుకుని మృదువుగా నొక్కి వదిలేసాడు.

****************************************************************************** 

నెల రోజుల తర్వాత స్నేహితుడిని తోడుగా తీసుకుని మళ్ళీ మనోజ్ఞ వాళ్ళ ఊరు వెళ్ళాడు. మనోజ్ఞ తల్లిదండ్రులతో మనోజ్ఞని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాననీ, ఆర్య సమాజంలో రెండు వారాల తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నాననీ చెప్పాడు. తన తల్లిదండ్రులతో ఇంకా మాట్లాడలేదనీ, వాళ్ళు వస్తారో, రారో చెప్పలేననీ మీరైనా వస్తే బాగుంటుందనీ అన్నాడు. వాళ్ళు అభ్యంతరమేమీ చెప్పకుండా అలాగే వస్తామంటే 'పెళ్ళైన తర్వాత కూడా మీరు కొన్ని రోజులు మాతో ఉంటే మాకు కొంత సపోర్ట్ గా ఉంటుంది, మీరు మీ వీలు చూసుకొని చెప్పండి.' అని కోరాడు.

అతనికి గుదిబండ అవుతానేమోనన్న అనుమానం వల్లనో, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయంతోనో మనోజ్ఞ ముందు నిరాకరించబోయింది కానీ అతను 'I think we need each other now more than ever. ఈ కొత్త పరిస్థితులకి విడివిడిగా అలవాటు పడటంకన్నా కలిసి నేర్చుకోవడమే మంచిదేమో' అనడంతో మౌనంగా ఉండిపోయింది. వాళ్ళిద్దరే ఉన్నప్పుడు మాత్రం అతను 'నీకు చూపు రావడానికి యాభై శాతం అవకాశం ఉంది, కానీ నాకు మాత్రం ఎంతోకొంత వైకల్యం జీవితాంతం ఉంటుంది. అదొక్కటీ నీకు ఓకేనో కాదో ఆలోచించుకో. నువ్వు ఇంకో ఆరు నెలలు ఆగుదామన్నా పర్లేదు. మిగతా వాటి గురించి భయపడకు.' అని చెప్పాడు.

పెళ్ళి గురించి చెప్పగానే ప్రభాత్ తల్లిదండ్రులు అతడిని తిట్టిపోసారు. గుడ్డిదాన్ని చేసుకుని ఏమి సుఖపడతావన్నారు. ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకుని కాలు బాగా నయంచేసుకుని మంచి సంబంధం చూసి చేసుకోమన్నారు. బెదిరించటానికీ, భయపెట్టడానికీ ప్రయత్నించారు. కానీ అతను దేనికీ లొంగలేదు. తమ సంగతీ, చెల్లెలు సంగతీ ఏమిటని అడిగితే చెల్లెలి పెళ్ళి సంగతి తను చూసుకుంటాననీ, వాళ్ళకి తను చేయగలిగినంత చేస్తాననీ చెప్పాడు. పోనీ ఇంకొన్నాళ్ళు ఆగి ఆ అమ్మాయికి చూపు వస్తే అప్పుడు చేసుకొమ్మని చెప్తే 'పెళ్ళి అనుకున్న రోజుకే జరుగుతుంది, మీరు వస్తే బాగుంటుంది. వద్దనుకుంటే మీ ఇష్టం. కానీ మాకు మాత్రం కొత్త తలనొప్పులు తీసుకురావద్దు.' అని ఖచ్చితంగా చెప్పేసాడు.

******************************************************************************

అప్పటిదాకా తను ఫ్రెండ్స్ తో ఉన్న కాంప్లెక్స్ లోనే ఇంకొక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకున్నాడు. పెళ్ళైన తర్వాత  రెండు నెలలు మనోజ్ఞ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండి వెళ్ళారు. మనోజ్ఞ వాళ్ళు ఉన్నప్పుడే ఎలక్ట్రిక్ స్టౌవ్ మీద వంట చేయడం లాంటివి నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రభాత్ కూడా బైక్ అమ్మేసి స్కూటీ తీసుకున్నాడు. ఎవరితోడూ లేకుండా మార్కెట్ వరకు వెళ్ళి సరుకులు తీసుకుని రాగలుగుతున్నాడు.



'హే మనోజ్ఞా! ఏం ఆలోచిస్తున్నావు? ఆర్యూ ఓకే?' లాప్టాప్ లో ఆఫీస్ పని చేసుకుంటున్నవాడు తను చాలా సేపటి నుంచి సోఫాలో సైలెంట్ గా పడుకుని ఉండటం చూసి అడిగాడు.

'అయామ్ ఓకే బావా! నువ్వు పనిలో ఉన్నట్టున్నావని కదిలించలేదు.'

తన గొంతు దిగులుగా ఉన్నట్టు అనిపించడంతో 'అయిపోయిందిలే' అంటూ లాప్టాప్ పక్కన పెట్టి సోఫా దగ్గరికి వెళ్ళి మనోజ్ఞ తల ఎత్తి ఒళ్ళో పెట్టుకుని బుగ్గమీద సున్నితంగా రాస్తూ కుర్చున్నాడు.

'నేను బాగానే ఉన్నాను బావా. ఏమీ ఏడవట్లేదు.'

'గుడ్.'

'మన పెళ్ళికి ముందు రోజు బాగా ఏడ్చాను కదా. అప్పుడే గట్టిగా అనుకున్నాను, ఇంకెప్పుడూ ఈ రీజన్ వల్ల ఏడవకూడదని. రోజూ ఏడుస్తూ కుర్చుని కూడా ఉపయోగం లేదు కదా!'

'ఊ..అత్తయ్యా వాళ్ళు వెళ్ళిపోయారని దిగులుగా ఉందా?'

'కొంచెమైతే ఉంది. కానీ ఒకరకంగా అదీ మంచిదే. వాళ్ళు లేకుండా మనం ఎలా ఉండగలమో కూడా తెలుస్తుంది. ఎల్లకాలం వాళ్ళ మీదే డిపెండ్ అయిపోయి ఉండలేము కదా.'

'ఊ..'

'అత్తయ్యా మామయ్యలు ఇప్పుడు బానే మాట్లాడుతున్నారు, అవసరం అయితే వాళ్ళని పిలవచ్చుకానీ చూద్దాం.'

'ఊ..'

'నువ్వన్నట్టు మనకు కావలసిన తిండి, బట్టలు అన్నీ మనమే సృష్టించుకోలేము. అంతవరకే మనం సొసైటీ మీద ఆధారపడాల్సింది. We are on our own for the most part! వేరే వాళ్ళ మీద పెద్ద డిపెండెన్శీ లేకపోవడమే మంచిది.'

'ఊ..'
.
.
.
'ప్చ్...ఎన్నో అనుకున్నాం. ఎన్ని ఆశలు, ఎన్ని కలలుకన్నామో కదా?'
'యా. అవ్వన్నీ ఇప్పుడు నిజం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా?' ఇప్పుడు, ఇంకా అన్న పదాలని ఒత్తి పలుకుతూ అన్నాడు.

'ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ మాత్రం మనకే ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంటుంది.'

'ఏం? మనకేమైనా కొమ్ములున్నాయా? అయినా అన్నీ అనుకున్నట్టు జరిగిపోతుంటే లైఫ్ మరీ చప్పగా అయిపోతుంది. అఫ్కోర్స్, ఇప్పుడు అవసరమైన దానికన్నా మరీ చాలెంజింగ్ గా అయిపోయిందనుకో. కానీ ఇప్పుడు కూడా పాజిటివ్ వి చాలానే ఉన్నాయి. అదృష్టవశాత్తూ నాకు కాలికి తగిలింది. అదే కాలికి కాకుండా చేతికి ఏమైనా అయ్యుంటే ఉద్యోగానికి కూడా ప్రాబ్లం అయ్యేది. అప్పుడు పరిస్థితి ఘోరంగా ఉండేది. నాకు ఆ రోజు చివరగా గుర్తున్నది నువ్వు గోడ వైపు జారుతూ వెళ్ళడమే. హాస్పిటల్ లో స్పృహ వచ్చినతర్వాత నీ గురించి అడిగితే ఎవరూ ఏమీ చెప్పకపోయేసరికి చాలా భయం వేసింది. నీకు స్పృహ వచ్చి మాట్లాడగలుగుతున్నావని తెలిసినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను. ఆ తర్వాత నీకు సరిగా కనిపించట్లేదని తెలిసినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నీకేమైనా అయ్యుంటే? మనం ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఏదీ రెండోసారి విడమరిచి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్నిసార్లు అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు. సరిగా అర్ధం చేసుకోలేని మనిషిని చేసుకోవాల్సి వచ్చుంటే? అప్పుడు పరిస్థితి ఇంతకన్నా బాగుండేదని అనుకోను. బాధని కొలవడానికి పరికరాలేమీ లేవు కదా?'

'ఊ..' సోఫాలో నుంచి లేచి ప్రభాత్ ని గట్టిగా వాటేసుకుని కుర్చుంది.

'అఫ్కోర్స్, పాజిటివ్ లే చూడాలంటే మనం ఇక్కడున్నందుకూ, ఏ ఆఫ్గనిస్తాన్లోనో, సోమాలియా లోనో లేనందుకూ కూడా సంతోషపడచ్చు.' అంటూ నవ్వాడు.

'బావా, నాకు అంతా బానే ఉండి నీకొక్కడికీ మాత్రం దెబ్బలు తగిలితే అప్పుడు కూడా ఇలాగే పెళ్ళి చేసుకుందామనేవాడివా?'

'నీకిప్పుడు ఉన్నవి చాలట్లేదా? ఈ జరగని Ifs & buts గురించి కూడా ఆలోచించి మనసు పాడు చేసుకోవాలా? ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించు.'

'అప్పుడు నేను నీ వెంట పడాల్సొచ్చేదా?'

'అదంతా ఇప్పుడెందుకు? ముందు ఇప్పుడు ఏమి చెయ్యాలో చూడు.'
.
.
.


'నేను ఇందాక అదే ఆలోచిస్తున్నాను బావా.ఈ దిగుళ్ళూ, భయాలను పూర్తిగా వదిలించుకోవడానికీ, ఎవరి మీదా అధారపడకుండా మన పనులన్నీ మనమే చేసుకోగలగడానికీ ఇంకో 3-4 వారాలు పడుతుందేమో. రెండుమూడునెలల్లో ఇవన్నీ దాటేసి మనం మామూలు జీవితాల్లో పడిపోతే బాగుంటుందనుకుంటున్నాను. అప్పటికి డాక్టర్లు కూడా నా పరిస్థితి ఏమిటని చెప్పగలుగుతారేమో. కానీ నాకు అమ్మా వాళ్ళు వెళ్ళిపోయినతర్వాత నువ్వు ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం బోర్ కొడుతోంది. ఏంచెయ్యాలో అర్ధం కావట్లేదు.'

'యా. కానీ ఈ డాక్టర్ల గురించి - Lets hope for the best, but let's not wait for it. అంతా బానే జరిగితే మంచిదే. కానీ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అవుతాయనుకుని ప్రిపేర్ అవుదాం. లాంగ్ టర్మ్ గురించి తరువాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే కాస్త చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడటం మొదలుపెట్టు. నీకు మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్ కదా? మన కాంప్లెక్స్ లో నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ ఉన్న చిన్న పిల్లలు ఉన్నారేమో. వాళ్ళకి క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టు. నీకు కూడా కొంచెం కాలక్షేపంగా, రిలీఫ్ గా ఉంటుంది. We will go from there.'


******************************సమాప్తం******************************************

No comments:

Post a Comment