Saturday, February 14, 2015

ఒక మంచి పుస్తకం ' ద న్యూ పెరల్ హార్బర్ ' - I

9/11 గురించి విననివారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. ప్రపంచ చరిత్రని మలుపు తిప్పిన రోజు అది. సెప్టెంబరు 11, 2001 న అమెరికాపై జరిగిన దాడులకి సాధారణ అమెరికన్ ప్రజలు భయభ్రాంతులయ్యారు, యావత్ప్రపంచం విస్తుపోయింది. మూడువేలమందికి పైగా సాధారణ పౌరులు మరణించారు, మరికొన్నివేలమంది గాయాలపాలయ్యారు, కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడుల పర్యవసానంగా అమెరికా ముందు ఆఫ్ఘనిస్తాన్ పై, ఆ తరువాత ఇరాక్ పై యుధ్ధానికి దిగింది.

ఇన్ని పరిణామాలకి కారణమైన ఆ రోజున నిజంగా ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఈ దాడులు జరిగి దశాబ్దం దాటిపోయినా కొన్నివందల ప్రశ్నలకి సమాధానం ఎవరికీ ఈ రోజుకీ తెలియదు. ఉదాహరణకి - హైజాకర్లు నిజంగా ఆ 19 మందేనా? మరి అయితే వారిలో కొందరు ఆ రోజు ఆ విమానాలలో అసలు ప్రయాణమే చేయలేదని, కొంతమంది ఇంకా బ్రతికేవున్నారన్న వార్తలలో నిజం ఎంత? వారిలో చాలామంది ముందునుంచే అమెరికాలో ఉన్నప్పుడు వారికి లోకల్గా ఎవరైనా ఈ దాడులకి సహాయసహకారాలు అందించారా, మరి వాళ్ళకి ఏమైనా శిక్షలు పడ్డాయా? ఒక విమానం హైజాక్ చేయడమే చాలా కష్టం అయితే ఒకేసారి నాలుగు విమానాలు హైజాక్ ఎలా చేయగలిగారు, దానిలో అమెరికా మిలిటరీ/ఇంటెలిజెన్స్/ఏవియేషన్ అధికారుల వైఫల్యం ఎంత, బాధ్యులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అసలు దానిగురించి ఈ దాడుల తరువాత ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసారా, 9/11 కమీషన్ని దాడులు జరిగిన సంవత్సరం దాకా (నవంబర్ 27, 2002) ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ కమీషన్ నిష్పాక్షికంగా, సమర్ధవంతంగా పని చేసిందా?

విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్లు 1,2 పై అంతస్తుల్లోకి చొచ్చుకొనిపోతే అవి ప్రక్కకు పడిపోకుండా భౌతికసూత్రాలకు విరుధ్ధంగా నిట్టనిలువుగా ఎలా కూలిపొయాయి? అమెరికన్ ప్రభుత్వం చెప్పినట్టుగా విమానాలలోని ఇంధనం మండటం వల్ల వచ్చిన వేడితీవ్రతకి ఇనుపరాడ్లు కరిగిపోయి ఆ భవతులు పడిపోయి వుంటే,  అందులో పనిచేసే వుద్యోగులు పడిపోయే చివరినిమిషం వరకు  ఎలా బ్రతికి ఉండగలిగారు (తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ, సహాయం కోసం అర్ధిస్తూ)? విమానాలవల్లే అవి పడిపోయివుంటే అలాంటి విమానమే గుద్దుకున్నట్లు చెప్పిన పెంటగన్ లో ఒక మూల మాత్రమే ఎందుకూ పాడయ్యింది? అసలు పెంటగన్ ని గుద్దుకున్నది విమానమేనా, అయితే అక్కడ విమాన శకలాలు ఏవీ ఎందుకు కనిపించలేదు? అమెరికన్ ప్రభుత్వం చెప్పినట్టుగా విమానం మొత్తం ఆవిరి అయిపోయివుంటే మరి అందులోని ప్రయాణీకుల అందరి DNA నమూనాలు ఎలా సేకరించగలిగారు? 2001 లో విమానాలనుంచి సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసే టెక్నాలజీ లేనప్పుడు పెన్సిల్వేనియాలో కూలిపోయిన నాలుగవ విమానంలోనివారు వారి బంధువులకు ఎలా కాల్స్ చేయగలిగారు?

ఇలాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానం లభించకా, అమెరికన్ ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందకా అనేకమంది ఔత్సాహికులు 9/11 దాడులకు ముందూ, తరువాతా జరిగిన ఘటనలను ఇండిపెండెంట్ గా రీసెర్చ్ చేసి చాలా కొత్తవిషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇలాంటివారిలో ఒకరు రిటైర్డ్ అమెరికన్ ప్రొఫెసర్ అయిన 'డేవిడ్ రే గ్రిఫిన్ ' . 9/11 దాడుల గురించి రీసెర్చ్ చేసి ఆయన వ్రాసిన పుస్తకమే ఈ 'The New Pearl Harbor'.

No comments:

Post a Comment